Friday, January 15, 2021

తగిరంచ నానీలు

నానీలు 

1
ప్రపంచమంతా  
అరచేతుల్లో .. 
చరవాణి పుణ్యం
ఐనవాళ్లూ దూరమే 

2
అంతర్జాలంలో 
ఆత్మీయతల వర్షం  
గ్లోబలైజేషన్ 
వరప్రసాదం 

3
పరిశ్రమలకు 
భారి పట్టం !  
ఫలితం శూన్యం
చెమట చుక్కలకు !! 

4. 
అంతరిక్షంలో
మానవుడి ఆటలు.. 
అంతరంగాలలో 
దానవత్వ పోటీలు 

5. 
వెర్రి పోకడలే
నాగరికతాయె! 
సమాధి తప్పదు 
పునాదులు మరిస్తే 

6. 
కాలమైనా ,
కరోనా ఐనా 
క్షయమవ్వాల్సిందే
చివరికి మనమైనా 

7. 
అవతరించెను 
అన్నపూర్ణమ్మ  
అన్నం పెట్టమ్మా 
రోడ్లపై నిర్బాగ్యులకు 

8. 
నేలమ్మ దాహం 
తీర్చడానికే 
పుట్టిందట గంగమ్మ 
రైతన్నకు సంబురం 

అసలైన స్నేహాం   
అటుకులే నిదర్శనం 
కాదంటావా !? 
కల్మషం తీసి చూడు

10. 
ఉన్నదమ్ముకోకు 
అప్పు జోలికోకు 
అక్షయతృతీయా!?  
ఆత్మీయతే స్వర్ణం 

11.
అవుతుంది 
ప్రతిదినం 
అక్షయతృతియే!  
హృదయం బంగారమైతే 


12
అన్నదాత సుఖీభవ
ఆశీర్వాదమే! 
ఎండుతూనే   
పండించిన కడుపు! 

13 
ఎంత వృథానో  
కడుపునిండి!? 
మెతుకువిలువ 
చెమటచుక్కకెరుక! 

14
నిద్రలేని 
క్షణాలెన్నో ! 
ప్రకృతివిపత్తు కన్న 
నేతల మొండిచేయికి!! 

15
కల్తీమందులకు
ప్రాణాలు ఖతం! 
పురుగులవా??
కాదు, రైతన్నలవి!!  

16.
పేపర్లో 
పెరిగినవి 
ప్రకటనలే కాదు.. 
రైతుల ఆత్మహత్యలు 

17
పనులలో 
ఒకరితోడొకరు
కరోనా పుణ్యమే! 
అర్థనారీశ్వరులు

18
ఇంటికి దీపం 
ఇల్లాలే! 
ఇరువురొకటైరి 
ఇంధనం ఆయనే! 

19
ఆడమగా 
తేడాలన్నదెవరు? 
కావాలంటే.. 
కరోనాను అడుగు! 

20
లాక్ డౌన్ 
మొదలైంది ! 
ఇళ్లే ఇపుడు 
ప్రపంచమైంది  

21
ఒలంపిక్ సంబరాలు 
చిన్నబోయాయి! 
అష్టాచెమ్మా, 
పచ్చీసుల ముందు!!  

22
తారల సంబరం 
రెట్టింపయ్యింది!    
పిల్లల కేరింతలే
మెరుపులద్దగా ! 

23

కరోనాకు 
కాడు పేరుస్తున్నరు! 
ఇంటిల్లిపాది 
ఇంట్లోనే ఉంటూ!! 

24

గడపలోకి 
రానీయనన్నది 
పల్లెతల్లి! 
కాలుష్యాన్ని, కల్మషాన్ని ! 

25
కల్తీ లేని
మనసులతో 
పల్లెచెట్టు!  
బువ్వనిచ్చే పూలబిడ్డలు!! 

26
పల్లెతల్లికి 
కడుపుకోత ! 
పంటసిరులు మాయం
రియాల్టర్ల గద్దలతో!! 

27
గురువులెవ్వరో
నాపల్లె తల్లికి! 
కిలకిల రావాల
సంగీతకోవెల! 

28

ఎదురుచూపుల
కన్నీళ్లతో 
నా పల్లె! 
పరదేశంలో కన్నబిడ్డలగోస!! 

అంశం: భిక్షగాళ్లు

  *** 
చిరిగిన చొక్కా 
"చిల్లర"అడుగుతుంది! 
నాణాలైతే
చిరిగేపోవని!!   ...29
     *** 
కాళ్లులేని ఆకలి 
"ధర్మం"అడిగింది!
నాల్గు పాదాల మీద  
నడవాలని !   ...30
     ****
గుడి బయటనే 
దేవుళ్ళున్నారు! 
*పుణ్యాన్ని" 
నిత్యం ప్రసాదిస్తూనే.. !! ...31
 
     *** 
కోట్ల సంపద 
స్విస్ బ్యాంకుల్లో ! 
ఆకలిమంట 
మెట్లమీద గుండెల్లో !! ..32
   ***
దైవమే
మానవత్వమేమో !? 
ఆలయం ముందు
ఆకలి కడుపులు! ... 33
 ***
మండుటెండలో
వైకల్యదేహం 
కాలిపోతుంది 
మెతుకు దొరకక ?!... 34
 *** 
ప్రతి ఒక్కరం 
భిక్షగాళ్లమే ! 
ఎప్పుడో ఓసారి 
ఏదో అడగుతూ..!! ...35
****
ప్రాచ్యం - పాశ్చాత్యం*
         
      ****
చెదిరినజుట్టు 
చిరిగిన ప్యాంటు 
పాశ్చాత్య పోకడా!?
పిచ్చోడా..?!          ----  36
  
    **** 
పాశ్చాత్యమా.. 
ఎంత పాపకారివే ? 
తేనెసంస్కృతిలో
విషం  పోస్తున్నావ్ !?    ....37
        ***
మనిషి మనిషిగా 
బ్రతకాలంటే, 
అంతం చేయాల్సిందే!? 
అశ్లీలసంస్కృతిని !         ...38
           *** 
క్లబ్బులు , ఫబ్బులు 
వింత మోజులో 
నేటి తరం..!? 
సొంతింట్లో పరాయివాళ్లలా!! ..39
           **** 

పాశ్చాత్యపు వెర్రి, 
అదేమైనా గొప్పా? 
కన్నతల్లియొక్క  
కాళిధూళితోసమం.!    ... 40
 **** 

          *** 
అదొక స్మారక చిహ్నం 
కాదు కాదు.. 
సత్యాహింసల
సజీవ దైవం ! .... 41
           **** 
స్వేచ్ఛా పతాకపు  
ఊపిరి చిహ్నం!
 రాజ్ ఘాట్! 
శాంతిమంత్ర దేవాలయం!  ...42
            *** 
నివాళి  అర్పించుటేనా !?  
ప్రతినిత్యం  
అనుసరించాల్సిన 
జీవన సత్యం!     ...43
            ** ** 
యమునా తీరం 
మహాత్ముని మార్గం 
రాజ్ ఘాట్ - 
నిరాడంబర హృదయం !...44 
         **** 
నల్లరాతి నిర్మాణం..  
శాశ్వత జ్వాల..
రాజ్ ఘాట్ 
ప్రపంచానికే వెలుగురేఖ ...45 
         **** 
ఆదర్శజీవితం 
ప్రతి తరానికి వరం 
రాజ్ ఘాట్ .. 
జాతిపిత ఆలయం! ...46 
   **** 


దిక్కులు చూస్తావేం? 
ఆస్థులమ్ముుకో .. 
ఆక్సిజన్ సిలిండర్లకు!
చెట్లు నరికావ్ గా!!     ...47

ఊపిరి 
ఆగిపోతుందా ?
ఆలస్యమెందుకు!?
త్వరగా..  ఒక చెట్టు పెంచు  ...48 

తనని నరికితే
నీ ప్రాణాలే ఖతం!  
ఆయువు పోసే 
ప్రాణవాయువు వృక్షం!  ...49 

నీ గాయం చూసి 
తన హృదయం నలిగింది ! 
ఫలితం- పసరై 
ఔషధమైంది  .. 50

( నీ గాయానికి 
తనహృదయం నలిపి 
పసరుపూసింది!  
ఔషధాలయం చెట్టు )  ..51 

దేవుళ్లంతా 
చెట్లవద్దే కొలువైరి!
వాళ్లకెరుకే..  
అసలు దైవం చెట్లని!...  52

ఏ భేదం లేక 
ఇలలో వరాలిచ్చేది 
ఒక్కరే - అదే 
ఆకుపచ్చ దైవం ..  53 

సకల జీవులు 
తన ఒడిలోనే !
అతిథులే 
దేవతలు కదా !! .. 54

 అంశం: స్వేదవేదం

ప్రపంచమెంతగ
మెరిసిపోతుందో.!  
శ్రమసూరీళ్ల 
చెమటచుక్కలతో  ...55 
         *** 
చరిత్రపుటలు 
నిలబడ్డాయి 
అక్షరాలుగా 
స్వేదబిందువులు  ... 56
  ***
మనిషి బ్రతుకును  
చెక్కుతున్న యోధులు... 
శ్రమసుత్తి, 
చెమటఉలి! .... 57
   **** 
ఎక్కడేం జరిగినా 
ఎవరేమన్నా .. 
బలయ్యేది 
శ్రామికుని బ్రతుకే !  .. 58
  *** 
ఇనుప కండలు 
ఉక్కునరాలు 
వాళ్లకే సొంతం 
మాడే కడుపులు !.. 59
   ****
మేడమిద్దెలదెంత
సౌందర్యమో.. ! 
తీర్చిదిద్దింది
కార్మికస్వేదం కదా!   ...60
  *** 
గుక్కెడు 
గంజినీళ్లకోసం 
కార్మికులు..!  
రెక్కలు ముక్కలాయె!!   ..61

అంశం: ఓటు

నువు ఎలా కొలిస్తే 
అలా వరమిస్తుంది.. 
ప్రజాస్వామ్యానికి 
ఓటే దైవం !!     ...  62 
  *** 
అభివృద్ధా ?
అధోగతా!? 
అంతా నీచేతుల్లోనే 
ఓటు దిక్సూచి     ... 63
   *** 
వాడు వేసే 
"చిల్లర"కాశపడి  
అమ్ముకుంటవా ?! 
ఓటు కన్నతల్లిరా .... 64
 
       **
జిత్తులమారి 
గుంట నక్కలపై 
వదిలే తూటా! 
నువు వేసే ఓటు!! ... 65
      *** 
మందు, మనీ 
ఇంకా బినామి ! 
ఓటుపోటయ్యిందా... 
అవినీతి గుండెల్లో సునామి !! ... 66
    *** 
ప్రజాస్వామ్యవృక్షానికి 
 తానే నీరు 
తానే కలుపుమందు!   
ఓటుదివ్యౌషధం  ...   67 
  **** 
నిలబెట్టాలన్నా 
పడగొట్టాలన్నా 
నీ సంకల్పమే! 
ఓటువజ్రాయుధం  ... 68

రక్షకులు-భక్షకులు 
   
    **** 
మూడుసింహాలూ
రక్షిస్తాయట..  
ఒకటో రెండో 
లంచాన్ని భక్షిస్తూ...!   ..69
  *** 
అవినీతి
భక్షకులవీపుపై 
వాతలశిక్షలు.. 
రక్షకలాఠీలు!      ...70
   *** 
ప్రపంచాన్నే 
భక్షిస్తూ కరోనా ! 
తామే రక్షకులైన 
శానిటైజర్, హ్యండ్ వాష్ ..!!  ...71
 ***
వైద్యులు,
పోలీసులు,
అసలు రక్షకులు 
పారిశుధ్య కార్మికులు!    .... 72
  ****
అధికారపీఠాల
ఆమ్యామ్యా కు 
సెల్యూట్ చేస్తున్నాయి 
వంతపాడే ఖాకీలు!      ..... 73
  **** 
ప్రకృతిదైవం 
రక్షిస్తూనే ఉంది! 
మనమే భక్షకులం .. 
కాలుష్యం చేస్తూ.. !    ... 74
  *** 
తిండీ నిద్ర మరిచి
అనుక్షణం మనకోసం.. 
రక్షుకులు..   
జవాన్లు రైతులే ! .... 75
   *** 
అంశం: ప్రాణం*
     **** 
ఊపిరి 
ఉండడమే కాదు 
ప్రాణమంటే .. 
హృదయం "స్పందించ"డమే !  ..76
        **** 
నిన్ను నీవే 
చంపుకుంటావేం..?! 
ప్రేమను పంచి చూడు 
"ప్రాణం" పోసుకుంటావ్ !!    ...77
           **** 
ఏం రాతలని
తిట్టేవాళ్లెందరో ..!?
వాళ్లకేం తెలుసు.. 
కవిత్వం నా "ప్రాణమ"ని !  .. 78 
       ***** 
కదలని మొద్దులా 
ఇంకెంత కాలం ..?!
"ప్రాణ"మంటే 
"చైతన్య ప్రవాహమే" !!   ... 79
         ***** 
పంచభూతాల
మిళితమేనా 
ప్రాణమంటే ... 
పెనవేసుకున్న పాశాలే !! ..... 80
         **** 
కడుపునిండాలంటే 
దాన్నే బలివ్వాలా?! 
నిన్నిస్తే సరి .. 
నీది "ప్రాణమే" కదా ! .... 81
    **** 
సజీవమై 
తిరగడమేనా ..?!
ప్రాణమంటే.. 
పచ్చని చెట్టులా బ్రతకడం! .... 82
  **** 
జాతిని 
మలుపుతిప్పిన నోట
*హేరామ్*
చివరి మాట - మనబాట ...83
 
    ***
దేహానికి మాత్రమే 
విశ్రాంతి .!
హేరామ్..  - బాపు
నిరంతర సజీవ స్రవంతి !!   ..84 

       *** 
సమయపాలన 
తప్పని జాతిపిత! 
ప్రార్థనసమయంలోనే 
  "హేరామ్ " !!    ... 85 

   **** 
గాడ్ ను కాల్చిన గాడ్సే!  
  "హేరామ్ "   
అంతమవ్వదెపుడూ.. 
తను నడిచినమార్గం     ...  86
      *** 



మనిషెప్పుడూ 
ఒంటరి కానే కాదు..!  
అసలైన తోడు 
ఒంటరితమే !    87

తుంటరి 
ఆలోచనలకు 
నిజమైన పునాది 
ఒంటరితనమే !!  88 
 
పగిలిన ఎదను 
ఓదార్చుతుంది.. 
కన్నీటితో 
ఒంటరితనం !!   89

భౌతిక దూరమో.. 
మానసిక దూరమో ..
బ్రతుకుకు మందు 
ఒంటరితనమే !   90


సంతోషం అందరితో 
గంతులేస్తుంది .. 
ఒంటరిగా ఏడుస్తుంది 
 విషాదం !   91

నానీలు* 

ఒక్క రూపాయిచ్చి 
బొచ్చెడు ఫొటోలు..
మానవత్వమంటే
ఆడ్వర్టైజ్ మెంటా ?!!  ..92

దేవుడు 
వరమీయలేదంటావా..?  
సాయం చేసి చూడు
తోటివాడికి!!    ...93

ఆకలి ఆర్తనాదాలకు
స్పందించిందా
నీ  హృదయం .. 
ఐతే నువ్ దేవునివే !! .... 94 

మానవత్వం 
నీ చిరునామానా  ?!  
 ఐతే నువ్ 
కలకాలం బ్రతికినట్లే  ..... 95

ఎంత కాలం 
ఈ జీవితం .. ?!
ఉన్నంత కాలం 
మానవత్వవిత్తులు చల్లుదాం ...96


    ***
మేఘాన్ని 
మాటలన్నదెవరో ?!
పాపం, ఆగకుండా 
కన్నీరై కురుస్తుంది!!   97
 
     ***
హృదయం,గగనం 
రెండూ ఒక్కటే?!
ప్రేమైనా,బాధైనా 
"కురవడమే" తెలుసు !!  98
      ***  
పబ్ జీ భూతం 
పట్టిందేమో .. ?!
పోరగాండ్ల కళ్లు
బోరుపొక్కల గుంతలు !? 99

అపుడపుడూ 
వర్షిస్తుందేమో ఆకాశం! 
ఎప్పుడూ చెమటనే  
వర్షిస్తూ.. నాన్న!!      100
*** 

జీవనచిత్రాన్ని 
అందంగా చెక్కుతూ.. 
విరామమెరుగని 
మహాశిల్పి నాన్న!    101
*** 

అడక్కుండానే 
అన్నీ ఇస్తాడు..! 
వరాలవర్షం కురిపించే 
దైవం .. నాన్న!!     102
**** 

నిరంతరం
 శ్రమిస్తూ.. 
బిడ్డలకడుపు నింపే 
అక్షయపాత్ర..నాన్న!!    103
*** 
తన నిద్రమాట 
దేవుడెరుగు.. ?!
పిల్లలసుఖం కోరే 
మహా తపస్వి.. నాన్న!!  104
 ***
అక్షరాలలో 
ఒలకనంత.. 
మాటల్లో చెప్పలేనంత 
గొప్పది .. నాన్న ప్రేమ!!  105

***  
తను తాగకుండా , 
కన్నబిడ్డలకే 
అమృతాన్ని 
పంచుతూ.. నాన్న !   106
*** 
పిల్లల భవిష్యత్తే 
ఆరాటం
నిత్యం పోరాటమే చేస్తూ.. 
నాన్న!   107  
***
సాగే ప్రతిదారిలో 
లక్ష్యశిఖరమై.. 
నిత్యం ఊపిరి పోస్తూ 
నాన్న ప్రేమ!!    108 
  *** 
సవాలక్ష సవాళ్లైనా  
సునాయాసంగా 
ఎదుర్కోవడం..  
నాన్న చూపిన దారి! ... 109
  ***

No comments:

Post a Comment