Friday, January 15, 2021

రుబాయీలు +RUBAYEELU

  రుబాయీలు        
     1  *** ***
సెలవులనీ వెళ్తానంటావా అవ్వగారి ఇంటికే  
సరదాగా వెళ్లొస్తానంటావా స్నేహితుల ఇంటికే  
ఒక్కసారి నువ్వే గడపదాటి అడుగు బయటవెట్టి చూడు
ఎవరికి కనవడకుండ సరాసరి వల్లకాటి ఇంటికే..  

          2  ****   **** 
గుంపుగూడి ముచ్చట్లేవో పెడదామంటావా 
అంతా కూడి ఆటలేవొ ఆడదామంటావా 
నలుగురు కూడే దారికాదు; కరోన మహమ్మారి!
సోంచాయించు జెర, ఇంట్లనే కూసుందామంటావా!
             
          3 ***      *** 
బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతిరూపం 
మాస్క్, గ్లౌస్, శానిటైజర్లతో సహవాసం 
కాదుకూడదని గాలికి తిరిగావే అనుకో?! 
కనబడని కరోనరక్కసికి నువె ఫలహారం 
               4***   ** 
మనిషి మనిషిని బ్రతికించేదే దూరం 
మనసు మనసును ముడిపెట్టేదే దూరం 
విషపుగాలి వ్యాపిస్తుందని తెలుసును కదా 
ప్రపంచ పటాన నిను నిలబెట్టేదే దూరం 
  
        5**** 
ప్రపంచమంతా కడుక్కునే పనిలోనే ఉంది 
కరోన కోరలు పీకాలనె కసిలోనెే ఉంది 
స్వచ్ఛత పాఠం అసలు సిసలు సేవకదా;ఇపుడు
మనిషిమెదడులొ, శుద్ధగీతం శృతిలోనే ఉంది 
            6** **
రోడ్లకంపులు వీధిమురుగులు ఎవరికి కనిపించలేదా ఇన్నాళ్లు? 
పట్టనట్టుగ ప్రతీఒక్కడు ఉమ్ముతూనె వెళ్లలేదా ఇన్నాళ్లు ? 
రక్కసి ఒకటి కాటువేయగ, 'పరిశుభ్రత'న్నది ఎఱుకాయెనిప్పుడు?! 
పారిశుద్ధ్య కార్మికులనే కసురుకుంటూ చూడలేదా ఇన్నాళ్లు?! 

                 7* **

దుర్గంధపు వీధులన్నీ పరిమళాలు జల్లెనని గమనించవు ఎందుకు?/ 
చెత్తనిండిన రోడ్లపైన శుద్ధనవ్వు పూయించె, తిలకించవు ఎందుకు?/ 
కీర్తికీరిటాల హంగులేవో కోరలేదు వాళ్లెపుడు!"స్వచ్ఛ'మది" కద!!/ 
దేవుళ్లకు ప్రతిరూపం వాళ్లేనని నీవసలు గుర్తించవు ఎందుకు?/ 
 
              8 **** 
 
వేడిని పుట్టించలేని వాక్యమెందుకు నాకు 
చైతన్యం రగిలించని కావ్యమెందుకు నాకు 
లోపల తిడుతూ బయటకు నవ్వే వాన్ని కాదు 
కుండనుబద్దలు కొట్టని పైత్యమెందుకు నాకు

     9***** 
ప్రతినిత్యం నవ్వాలని అనుకుంటే సరిపోతుందా  
గాయాలని మాన్పాలని కూచుంటే సరిపోతుందా 
ఎన్నిమైళ్లు నెత్తుటినడకలై సాగుతున్నయో చూడు 
పత్రికలో ప్రకటనిచ్చి దులుపుకుంటె సరిపోతుందా ?! 
      10 **** 
కోట్లకు కోట్లు ఏమయ్యాయని మెదళ్లనకుండా ఉంటాయా 
మూటలుగట్టి దాచిపెట్టావొ, చెదలు తినకుండా ఉంటాయా 
ఎంతగా దోచుకుంటేనేం; మనకెందుకంటావా "తగిరంచ"?! 
మాడిన పేగుల అరుపులను "కలాల"సలు  వినకుండా ఉంటాయా 
           11***
కొన్ని క్షణాలు ఎందుకో స్తబ్దుగా ఉంటాయి; 
మరికొన్ని క్షణాలు మహాముద్దుగా ఉంటాయి;  
ఎపుడేరీతిగ మారునో,  ఈ వింత కాలం; 
కొన్ని క్షణాలు జీవితాన హద్దుగా ఉంటాయి; 
        12***
కోట్లు కూడపెట్టుటకై ఎనలేని తాపత్రయం ఎందుకో / 
హుండిలో ముడుపులువేస్తేనె, పుణ్యమనుకోవడం ఎందుకో/ 
సాటి మనిషికి సాయం చేయడం దైవత్వమని గుర్తించు;/
స్పందించే ఎడదచాలు;  పై మెరుగుల సౌందర్యం ఎందుకో/ 
       13***
ఆకలితో ఉన్నవాడికి అన్నంపెట్టే హృదయమే అసలు దైవత్వం/  
ఆపదలో ఉన్నవాడిని ఆదుకునె మనస్తత్వమే 
అసలు దైవత్వం/  
ఏం వెంట తెచ్చుకున్నావని, ఆశలేవేవో పెంచుకుని గర్విస్తావు/ 
పదుగురి బ్రతుకులలో ఊపిరి నిలిపే మానవత్వమే అసలు దైవత్వం/ 

        14****
ఆదాయమంతా ఏ గోదాముల్లో నలుగుతుందో..?!  
వలసబ్రతుకు ఏ యినుపపాదాలకింద  చితుకుతుందో  ?! 
చలువగదుల పన్నీటికి చెమటచుక్కల విలువ ఏం తెలుసు 
ఆకలికడుపుల ఏ కాలకూటవిషం  చిమ్ముతుందో ?! 

     *)15 ******

చెమటచుక్కలు ధారవోసి నల్లటి రోడ్లను కూర్చారు వాళ్లు.. 
కాలే కడుపులతోనే వీధులను తెల్లగ ఊడ్చారు వాళ్లు 
మాటలతో బురిడికొట్టిస్తె సరి; వాళ్లతో మీకెందుకులే; 
నడిచే పాదాలతోనే ఎర్రటి రంగును వేశారు వాళ్లు

     **16** 
ఎవరు చూడలేదని తెగ సంబరపడుతూ ఉన్నావా ? 
పాపమేదైతేనేమని, లాభపడుతూ ఉన్నావా ? 
అంతరాత్మను మించి అసలు న్యాయస్థానం ఎక్కడుంది?! 
కుళ్లు బుద్దితో ఇంత నాటకమాడుతు ఉన్నావా ?! 
    17*****
చేసేది మంచో చెడో తెలిసేది ఎలా అంటావా? 
పాపమేదొ పుణ్యమేదొ, మోసేది ఎలా అంటావా ?! 
నీ అంతరాత్మను నువ్వు అడిగిచూడవోయ్  మనసారా ..
పదిమంది మెచ్చే పనులు పరిచేది ఎలా అంటావా ? 
            18*** 
అసలుసిసలు కార్యమేదొ, కాదనక సాగవోయ్ 
నలుగురితో నడకలేవొ, లేవనక సాగవోయ్ 
నిన్ను నీవు నమ్ముకో, అంతరాత్మ దైవమే.! 
సాటిమనిషి మేలుకై నువు జడవక సాగవోయ్ 

           19****  ***
అక్షరాన్ని అణగదొక్కాలని చూస్తావా ?
పుస్తకాన్ని పనికిరాకుండా చేస్తావా ? 
అహంకార పుఱ్ఱెలకు అంతం తప్పదులే 
నీతి నియమాలనే అమ్ముకుని చస్తావా ?! 
       20 *** 
రాక్షసులకు మనిషిరూపం పూస్తే, అది నువ్వేగా ? 
పైశాచికానికి ప్రాణం పోస్తే, అది నువ్వేగా ? 
పాతాళానికి పడిపోయె రోజు, దగ్గరలో ఉంది?! 
కుటిలత్వానికి కుతంత్రం కలిస్తే అది నువ్వేగా ?! 
  21 ** * 
పుస్తకం విజ్ఞానగని అన్న సంగతి మరిచిపోయావా ?
అధికారమదంతో బెదిరింపె గొప్పని మురిసిపోయావా ? 
ప్రగతి పథమంటె ప్రజాహితమేనని గుర్తుంచుకో,రాస్కెల్..!  
అక్షరాలను కూల్చి, నువు యోధుడినని 
భ్రమపడి పోయావా ?! 

      22*** ****
అనుమానపు నవ్వులు మెరుస్తూనే ఉన్నాయి
అబద్ధాల వానలు కురుస్తూనే ఉన్నాయి 
పూటకో అవతారంతో గుంటనక్కలెన్నొ ; 
జిత్తులమారి పోట్లు పొడుస్తూనే ఉన్నాయి
      23****
"తెల్ల"వారంగనే, "తెల్ల"ని బట్టలతో ఫోజులు 
"చీకటి" అయ్యిందా, "నల్ల"ని పనులపై మోజులు 
పైన పటారం-లోన లొటారం, ప్రబుద్దులు కద! 
అలాంటోళ్లనె అందలమెక్కించె నేటి రోజులు 
       24*****
తాటిచెట్టంత ఎత్తుకెదుగుతానంటే, ఇతరులకు నీడనివ్వలేవు 
నీడనిచ్చే మఱ్ఱిలాగ విస్తారిస్తానంటే, పండ్లనివ్వలేవు 
మానవత్వంతో విస్తరించి, మహోన్నతవ్యక్తిలా ఎదిగిపో "తగిరంచ"! 
హృదయమొక అనురాగవనమైతే చాలు; మోసాలకు జాడనివ్వలేవు 

25****
మంచేదో, చెడేదో,  మనిషికోమాట చెబుతూనే ఉంటారు 
ముంచడమో, నిలిపడమో, ఎవరేదేదో చేస్తూనే ఉంటారు 
మనలాగే మనమెపుడూ బ్రతకాలంటే కష్టమేనోయ్ ఇలలోన;
పూటకొక పుల్లవెట్టి కయ్యాలదారులు తీస్తూనే ఉంటారు.
     **26**** 
కొలమానం కొలబద్దలోనే ఉంటుందంటే కష్టమే 
బహుమానం వస్తువులోనే తెలుస్తుందంటే  కష్టమే 
మనసులోతు మమకారవిలువ లెక్కించామనుకుంటె కల్ల;
పై మెరుపులకే లోకం గులామవుతుందంటే కష్టమే; 
 27
ఆశలచెట్టు ఎప్పుడూ పూస్తూనే ఉన్నది 
వేస్తున్న బిస్కట్లనలా చూస్తూనే ఉన్నది 
సమాజం మొద్దునిద్రలో ఉందంటే మీ భ్రమ; 
మోసాలకు తగు కాడును పేర్చుతూనే ఉన్నది 
    **** 
28
అక్కడక్కడ పిచ్చిగ మొరుగుతూనే ఉంటాయి కుక్కలు 
కుటిలబుద్ధితో  గోతులు తీస్తూనే ఉంటాయి నక్కలు 
మనిషి మనిషిగా బ్రతకాలంటె ఎన్నెన్ని ఆటుపోట్లో!? 
తప్పక పాఠాలను నేర్పిస్తూనే  ఉంటాయి చిక్కులు 
 **29
తొలకరి జల్లులతడిని మరిపించేది.. ఏముంది 
మట్టివాసనను మించి మురిపించేది..  ఏముంది 
పచ్చనిపంటలన్ని పుడమితల్లి నవ్వులు కదా  
బురదమడి కన్న స్వర్గమనిపించేది.. ఏముంది! 
..***30 
కదలలేని శిలలు శిధిలమవుతూనే ఉన్నాయి 
పక్షులెపుడు  పైపైకి.. ఎగురుతూనే ఉన్నాయి 
చైతన్య స్రవంతివై సాగితేనె విజయం కద! 
తడబడక చేపలలా ఈదుతూనే ఉన్నాయి 

  ** 31
కలం-కాగితాలపైకి మనసెందుకో కొట్టుకుంటుంది
కాస్త ఆ చరవాణిని బహుదూరంగా నెట్టమంటుంది
అక్షరాలకు పదునుపెట్టి కవనశిల్పమొకటి చెక్కాలి; 
వాస్తవదృశ్యమై మానవత్వ ప్రాణం నిలుపమంటుంది
  **32
'కాసు'లపేరు పై మోహమెందుకోయి ఓ మనిషి! 
నవభవనములంటె మోజులెందుకోయి ఓ మనిషి!
మట్టిదుప్పటి కప్పుకొనెడి కాయమని తెలియదా!
తోడు నలుగురుండని బ్రతుకెందుకోయి ఓ మనిషి! 
     *** 33
గర్వకిరీటమెప్పుడో ఓ సారి నిను గంగలో ముంచుతుంది
ఆశలసౌధమెప్పుడో ఓ సారి నిలువునా కూల్చుతుంది
చావుబ్రతుకులలో తోడంటు నలుగురున్న బ్రతుకే ధన్యం!
స్వార్థఖడ్గమెప్పుడో ఓ సారి నీ హృదయాన్ని చీల్చుతుంది 
   **** 34
ఉంటేనేం పోతేనేం నలుగురికి ఉపయోగపడని బ్రతుకులు 
ఉంటేనేం పోతేనేం నలుగురితో కూడి నడవని బ్రతుకులు
చివరిగమ్యం దాకా బ్రతుకుబండిచక్రాలు ఆ నలుగురే 
ఉంటేనేం పోతేనేం నలుగురి మంచిని కోరని బ్రతుకులు 
*** 35
                    *******
ఆటలపోటీ కాదు, కానీ; కాలం ఓడిస్తూనే ఉంది 
ప్రేమబుుతువే; ఐతేనేం పసి పూలను కూల్చుతూనే ఉంది 
కాలపరిస్థితులకు జడవక ఎదురీదడమే కదా జీవితం; 
హృదయబంధమే; ఐనా అశ్రుధారను కురిపిస్తూనే ఉంది 
                     ******36
చీడలు పట్టిన పంటలు, చేతికి రావడము గగనమే 
వేదన ముసిరిన మది, నిశ్చింతగ ఉండడము గగనమే 
యుద్ధమేదైన ఇరువర్గాల్లో శాంతిని నింపలేదు
అశ్రువు జారక మనిషి జీవితం నడవడము గగనమే 
   ****37
చూడడానికి ప్రపంచపటం శాంతిమంత్రంగా కనిపిస్తుంది
ప్రతీదేశ సరిహద్దురేఖ యుద్ధతంత్రంగా కనిపిస్తుంది
దెయ్యాలు వేదాలను సుకుమారంగ వల్లిస్తూనె ఉన్నాయి
పూటకోమాట కుర్చీకి రక్షణయంత్రంగా కనిపిస్తుంది 
          ** 38****
చూడడానికి ప్రపంచపటం శాంతిమంత్రంగా కనిపిస్తుంది
ప్రతీదేశ సరిహద్దురేఖ యుద్ధతంత్రంగా కనిపిస్తుంది
దెయ్యాలు వేదాలను సుకుమారంగ వల్లిస్తూనె ఉన్నాయి
పూటకోమాట కుర్చీకి, రక్షణయంత్రంగా కనిపిస్తుంది 
   **** 39
కోట్లకు కోట్లు పడగలెత్తడమే లక్ష్యమాయెనా ?!
నోటికి కూడుకు బదులుగ "నోట్లే" భక్ష్యమాయెనా? 
మనిషి మనుగడ కన్న "మనీ"మనుగడే సరాగమట; 
ఉరుకులపరుగుల జీవనయంత్రమె సాక్ష్యమాయెనా?! 
           ***40
ఔరా అంటే దొరా అన్నట్లు విన్పిస్తుందా..!
మెతుకులబతుకులు నువే కొన్నట్లు అన్పిస్తుందా!
గులేర్ గురిచూసికొడితె చచ్చి కింద పడాల్సిందే! 
జనమింకా మీ మాయల  ఉన్నట్లు కన్పిస్తుందా!
      ****41
కొత్తదో, మత్తుదో, వేగం పరిమితిని దాటేస్తుంది 
చేతిలోని చరవాణి చెవిని ముద్దుగా వాటేస్తుంది
మితిమీరితె వేగమైన,మరేదైన ప్రాణాంతకమే;
నలనల్లనాగుంబామై తారురోడ్డు కాటేస్తుంది

No comments:

Post a Comment