చిరునవ్వుల పువ్వులాగ వెలుగుతుంది గాలి పటం
ఉన్నతంగ ఎదగమనీ చూపుతుంది గాలిపటం
వాకిలిలో పరుచుకున్న రంగవల్లి ముచ్చటాయె
హరివిల్లుల రంగులపై ఊగుతుంది గాలి పటం
జడగంటలు పరికిణీలు సొగసులతో మురిసిపోయె
ఆడపిల్ల హొయలుమించి కులుకుతుంది గాలిపటం
పుడమితల్లి పంటపురుడు పల్లెనిండ సంబరమే
పొంగుతున్న పాలలాగ నవ్వుతుంది గాలిపటం
హరిదాసుల కీర్తనలే హృదయాలను మురిపించగ
బసవన్నల ఆటచూడ కదులుతుంది గాలిపటం
ప్రతినాయకులై పోట్లాడుతు కోడిపందెమలరించగ
తిలకిస్తూ గాలిలోన ఆడుతుంది గాలిపటం
ఇంటింటా వంటలన్ని ఘుమఘుమలై కడుపునింపె
"తగిరంచ"కు సందళ్లను పంచుతుంది గాలిపటం
https://youtu.be/QwGzaZh7Zkg
No comments:
Post a Comment