Wednesday, September 7, 2016

గమ్మతిగ జూడవడితిమి - కవిత

గమ్మతిగా జూడవడితిమి .
                           తగిరంచ నర్సింహా రెడ్డి
                         చరవాణి    9912119901

ఎన్ని దినాలకెన్ని దినాలకో
గమ్మతిగ జూడవడితిమి ...!
తాటిజెర్రి పారుతున్నట్లు
ఒర్రెలన్ని జర్రున పారుడు .. !
ఒంటెలన్ని కడుపునింపుకున్నట్లు
కుంటలన్ని కుండపోతగ నిండిపోవుడు ... !!
ఊరూరి బ్రతుకుదెరువులైన
చెరువులన్ని అలుగుదుంకిపారుడు !!
మండూకాలన్నీ సంగీత మార్తాండులై
బెకబెకల సంబురపు గీతాలాపనలకు
చేపపిల్లలన్ని చెంగచెంగ నాట్యమాడడు !
యిన్నొద్దులసంది యాడ దాక్కున్నయో.. !
యాదిమరిచినయో.? ... గిప్పుడొచ్చి
పులకిస్తున్న జలకాంతకు
బాతులు  కితకితలు పెట్టుడు !
ఒలంపిక్ విన్యాసాలను మించి
గింత గింత పోరగాండ్లు
పెద్ద పెద్దచెట్ల మీదికెంచి
ఎగిరెగిరి  , తిరిగితిరిగి
నీళ్లల్ల కు సూర్లు కొట్టుడు ..!!
గజ యీతగాళ్లై
అడుగునున్న మట్టిని ముద్దాడి
దరిజేరే ఆనందపుటాటలు !
గట్లపైనున్న చెట్లన్ని
సరికొత్తగా ముస్తాబయ్యి
 తమ ఆకుపచ్చ అందాలన్నీ
తనివితీరా .. సూడముచ్చటగా ..
నీటిఅద్దంలో చూసుకునుడు..  !
ఎన్ని దినాలకెన్ని దినాలకో
గమ్మతిగ జూడవడితిమి ...!!

**** ***
ఎన్ని దినాలకెన్ని దినాలకో
గమ్మతిగా జూడవడితిమి ...!!
మాడమీద నూనెపెట్టినట్లుగ
ఒర్రెల మునిగిన బర్రెపెయ్యల
నునుపైనపెయ్యి(ఒంటి) మెరుపులు  ... !
సల్లని మొగులు మీద
సూరీడుగీసిన సింగిడి జూసి
 ప్రకృతి  నాట్యాచార్యుల
పురివిప్పిన జడకొప్పులాటలు ..!!
ఎగురుతూ వచ్చిన
వెండి పూలమాలలు
కొంగలై చెరువులో పూసినతీరు ..!!
ఎన్ని దినాలకెన్ని దినాలకో
గమ్మతిగ జూడవడితిమి ...!!
దగ్గరఒక్కరాయి  పడేస్తే చాలు
కష్కెలుపొదిగిన కవచకుండలాలలోకి
తాబేలు పిల్లల దాగుడుమూతలు ..!
పుడమితల్లి పచ్చటి పట్టుచీరపై
శృతిమెత్తగా అద్దిన ఎర్రని ఆరుద్ర పూల
అందమైన ముద్దుముద్దు పలకరింపులు  !
పంటపొలాల పచ్చటివరాలకోసం
పుణ్య క్షేత్రాల చుట్టూ
నదీతల్లి వెడ్తున్న పొర్లుదండాలు... !!
ఎన్ని దినాలకెన్ని దినాలకో
గమ్మతిగ జూడవడితిమి ...!!  

No comments:

Post a Comment