Friday, September 9, 2016

మాతృభాష

*ఆటవెలది పద్యాలు*

మాటలన్ని పలుక మమతలే కురిపించి
తేనెలూటలూరు తీపిభాష !
మదిని భావములను మమకారమునదెల్పు
మధురమైనభాష మాతృభాష !!

ఒగ్గుకథలలోన వొయ్యారమొలికించి
వన్నెలద్దినదయె మిన్నగాను !
పల్లెపాటలందు పరమాత్మ రూపమై
పరవశించెనదియె ప్రజలభాష !!

చెప్పదలచగాను తప్పొప్పులు గనుచు
మాతృభాషయొకటె మార్గమౌను !
భావమంత దెల్పి భారమంతయు దీర్చు
బంగరు గని!  మాతృ భాష యెపుడు !!

ఊరువాడలందు నూరేగి వెలిగెరా
ఉద్యమాన రగిలి నుజ్వలించె !
పొద్దుపొడుపులందు ముద్దుగా పలికించు
ఆత్మగల్ల భాష యవనియందు !!

No comments:

Post a Comment