Saturday, September 10, 2016

ఇల్లు - కవిత

*తగిరంచ*  *నర్సింహారెడ్డి*
నేటి అంశం : ఇల్లు

నాల్గు గోడల సంవృత పటం కాదు      
యిసుక సిమెంటు యిటుకల
మిశ్రమం అంతకన్నకాదు !
వాటి ధృఢత్వాన్ని మించి
వేయి రెట్లు ధృఢమైన బంధం !!
పిల్లపాపల ప్రాణబంధమే ఇల్లు !
ఆలుమగల ఆత్మీయ రాగమై
తల్లిదండ్రుల ఆత్మగుణమై
అన్నదమ్ముల అనుబంధమై
ఆనందమణులన్ని రాశిపోసి
మమతానురాగాలు కొలువైన
మహిమాన్విత దేవాలయమే ఇల్లు !

బయటి ఒత్తిళ్లను దూరంచేసి
ప్రశాంత వరములనిచ్చే దైవం !
ఇల్లాలు పిల్లలతో
ఇంట్లో  గడిపిన
మధురక్షణాల ముందు
విశ్వాన్ని జయించిన
తృప్తి కూడా చిన్నబోతుంది !!
వెన్నుదన్నై
వెన్నెల పాపై
చల్లనితల్లై
కమ్మని వరమై
స్వర్గధామమై
కలకాలముండే
తోడు నీడ ఇల్లంటే !!
ఇల్లంటే ప్రాణం !
ఇల్లంటే దైవం !!

నా హృదయకోవెల 

Friday, September 9, 2016

శిన్నగున్నప్పుడు

** శిన్నగున్నప్పుడు !!

చిన్నప్పడు చేతులనిండా
వీధులన్ని సూచిన గోటిలు
వజ్రాలై మెరిసిపోయేవి ..
జేబులు నిండిన
నేటి డబ్బుల సంచులకన్న
కోటి రెట్ల ఆనందాన్నిచ్చేవి
ముత్యాల్లాంటి గోటిలు నాడు  !!
ఏ యాళ్లకు తిందుమో
ఏ యాళ్ళకు పందుమో !
 ఆకలిమాటేమో గని
అలసట లేకుండా ఆటలే ఆటలు !!
శిర్రాగోనే ఆటంటే
చేతుల గదపట్టి కొట్టినట్లే !
శిన్నా పెద్ద అంతా చేరి
పొద్దుగాళ్లటిసంది
పొద్దగుాకేదాకా
మస్తుగ ఆడుతుంటుమి !
ఎండపొడకేమాటలని
అమ్మ కోప్పడ్తుంటే
నీడపట్టున కూసుండి
మొఖం మాడ్సుకున్న
నల్లటి చింతగింజలనరగదీసి
తెల్లటి మిలమిలమెరుపులద్ది
అష్టచెమ్మాట ఆడ్దుంటిమి !
పంజాలు మంచిగపడలెవ్వనీ
పచ్చీసాటల నడుమలకెంచి
పారిపోయి కచ్చకాయలాట
మొదలుపెడ్తుండే  మా చెల్లే !
మెరిసేటి పాలరాళ్లను
ఏరికోరితెచ్చి ఎగిరేసుకుంట
ఎగిరేసుకుంట ఆడుతూ
కచ్చకాయలసప్పుడులెక్కనే
గలగలాలొల్లివెట్టుకుంట
నవారు మంచమ్మీదపన్న
బాపమ్మకు గింతన్న
కునుకు లేకుండజేసేది !!
శేన్లసుట్టూత
గుట్టలసుట్టూత
 తిరిగి తిరిగి
పంచామృతాలు పంచే
పరికిపండ్లు , రేనిపండ్లు
తునికిపండ్లు మొర్రిపండ్లు
తీరొక్కటి తెంపుకుతినేది !!
ఆకుపచ్చని ఎన్నీలనుంచి
తునికాకుచుక్కలను
ఏరుకునితెచ్చి
పైసలు మరతవెట్టినట్లు
ఆకులు మరతవెట్టి కట్టలు కట్టేది !
యింతమంచిగున్నదనెనేమో
చెట్లపొంట గుట్టలపొంట
యింతమంది దేవుండ్లు
దేవతలు కొలువైనట్టున్రు
....... ......

       .... (ఇంకా ఇంకా...... )
  తగిరంచ నర్సింహారెడ్డి 

మాతృభాష

*ఆటవెలది పద్యాలు*

మాటలన్ని పలుక మమతలే కురిపించి
తేనెలూటలూరు తీపిభాష !
మదిని భావములను మమకారమునదెల్పు
మధురమైనభాష మాతృభాష !!

ఒగ్గుకథలలోన వొయ్యారమొలికించి
వన్నెలద్దినదయె మిన్నగాను !
పల్లెపాటలందు పరమాత్మ రూపమై
పరవశించెనదియె ప్రజలభాష !!

చెప్పదలచగాను తప్పొప్పులు గనుచు
మాతృభాషయొకటె మార్గమౌను !
భావమంత దెల్పి భారమంతయు దీర్చు
బంగరు గని!  మాతృ భాష యెపుడు !!

ఊరువాడలందు నూరేగి వెలిగెరా
ఉద్యమాన రగిలి నుజ్వలించె !
పొద్దుపొడుపులందు ముద్దుగా పలికించు
ఆత్మగల్ల భాష యవనియందు !!

Wednesday, September 7, 2016

మొగులుమీది సూపు మాత్రమే మిగిలింది!*

*మొగులుమీది సూపు
 మాత్రమే  మిగిలింది!*
                    నర్సింహారెడ్డి తగిరంచ

మురిపిచ్చిన కాలమిపుడు
పిచ్చిపట్టి యాడతిరుగుతుందో !
పచ్చనిపొలాలన్ని
పచ్చిదనం లేక
మలమలమాడిపోతున్నయ్ !!
లగాయించి వాన వడ్డదని
లాగోడి వెట్టుకుంట పోయె
అప్పుమీద అప్పుతెచ్చి !!
నాలుగు చినుకులు రాలకపోతయా
నాలుగిత్తులు పండకపోతయా అని
నాట్లేసుకుంటపోయె  !!
గిప్పుడు
మొగులుమీది సూపు మిగిలింది !
దిగులు గుండెలమీద గుదిబండైంది !
అప్పు  బుగులు  పుట్టిస్తుంది  !
పాడుకాలమును తల్చుకుంటుంటె
పీడకలలై పానము తీయవట్టె !!

అమ్మ
తనపిల్లలకు అన్నం తినవెడ్తది !
అమ్మకన్న గొప్ప రైతన్న !
లోకానికే తిండి తిన వెడ్తడు !!
నాకే కావాలనే
స్వార్థమే  లేని
వరి  మొలక రైతు !
ప్రపంచపు ఆకలితీర్చే
ప్రేమగింజయె రైతు  !
కరిమబ్బుల మాయ
రైతుమొలకలను
ముంచుతుందో ..
నలుగురికి బువ్వవెట్టే
ప్రేమ గింజలను
పంచుతుందో ... !!
మొగులుమీది సూపు
 మాత్రమే  మిగిలింది !!

ప్రియతమా - పద్యాలు

తేటగీతి

లెక్కలేనన్ని మురిపాలు లీలగాను
ప్రేమ తలపుల  పిలుపులే ప్రియముగాను
నీదు నవ్వులే వరములై  నేస్తమయ్యె
కోట్ల విలువరా ! నీ తోడు కోలుపోను !

అందమైన బుగ్గన నేను బిందువైతె
అంతకన్న భాగ్యమ్మేది యనవసరము.
పిచ్చి పిచ్చిగా ప్రేమనే పంచు చూపు
తోడు నీడగున్నయు చాలు తుదవరకును

ఆటవెలది
వేలి గోటిపైన వెన్నెల  వర్ణమై
మెరుపులద్దుతాను  మురిసిపోవ
కాలియందెల సడి కమనీయ రాగమై
కలిసిపోదునీలొ  కావ్య కన్య


గుండె సడిని వినెడి గొలుసునై చేరితే
పండగౌను నాకు ప్రాణమౌను !
గుండెగుడిని జేరి గుసగుసలాడితే
దిగులు దీరి మనసు దివ్యమౌను!! 

గమ్మతిగ జూడవడితిమి - కవిత

గమ్మతిగా జూడవడితిమి .
                           తగిరంచ నర్సింహా రెడ్డి
                         చరవాణి    9912119901

ఎన్ని దినాలకెన్ని దినాలకో
గమ్మతిగ జూడవడితిమి ...!
తాటిజెర్రి పారుతున్నట్లు
ఒర్రెలన్ని జర్రున పారుడు .. !
ఒంటెలన్ని కడుపునింపుకున్నట్లు
కుంటలన్ని కుండపోతగ నిండిపోవుడు ... !!
ఊరూరి బ్రతుకుదెరువులైన
చెరువులన్ని అలుగుదుంకిపారుడు !!
మండూకాలన్నీ సంగీత మార్తాండులై
బెకబెకల సంబురపు గీతాలాపనలకు
చేపపిల్లలన్ని చెంగచెంగ నాట్యమాడడు !
యిన్నొద్దులసంది యాడ దాక్కున్నయో.. !
యాదిమరిచినయో.? ... గిప్పుడొచ్చి
పులకిస్తున్న జలకాంతకు
బాతులు  కితకితలు పెట్టుడు !
ఒలంపిక్ విన్యాసాలను మించి
గింత గింత పోరగాండ్లు
పెద్ద పెద్దచెట్ల మీదికెంచి
ఎగిరెగిరి  , తిరిగితిరిగి
నీళ్లల్ల కు సూర్లు కొట్టుడు ..!!
గజ యీతగాళ్లై
అడుగునున్న మట్టిని ముద్దాడి
దరిజేరే ఆనందపుటాటలు !
గట్లపైనున్న చెట్లన్ని
సరికొత్తగా ముస్తాబయ్యి
 తమ ఆకుపచ్చ అందాలన్నీ
తనివితీరా .. సూడముచ్చటగా ..
నీటిఅద్దంలో చూసుకునుడు..  !
ఎన్ని దినాలకెన్ని దినాలకో
గమ్మతిగ జూడవడితిమి ...!!

**** ***
ఎన్ని దినాలకెన్ని దినాలకో
గమ్మతిగా జూడవడితిమి ...!!
మాడమీద నూనెపెట్టినట్లుగ
ఒర్రెల మునిగిన బర్రెపెయ్యల
నునుపైనపెయ్యి(ఒంటి) మెరుపులు  ... !
సల్లని మొగులు మీద
సూరీడుగీసిన సింగిడి జూసి
 ప్రకృతి  నాట్యాచార్యుల
పురివిప్పిన జడకొప్పులాటలు ..!!
ఎగురుతూ వచ్చిన
వెండి పూలమాలలు
కొంగలై చెరువులో పూసినతీరు ..!!
ఎన్ని దినాలకెన్ని దినాలకో
గమ్మతిగ జూడవడితిమి ...!!
దగ్గరఒక్కరాయి  పడేస్తే చాలు
కష్కెలుపొదిగిన కవచకుండలాలలోకి
తాబేలు పిల్లల దాగుడుమూతలు ..!
పుడమితల్లి పచ్చటి పట్టుచీరపై
శృతిమెత్తగా అద్దిన ఎర్రని ఆరుద్ర పూల
అందమైన ముద్దుముద్దు పలకరింపులు  !
పంటపొలాల పచ్చటివరాలకోసం
పుణ్య క్షేత్రాల చుట్టూ
నదీతల్లి వెడ్తున్న పొర్లుదండాలు... !!
ఎన్ని దినాలకెన్ని దినాలకో
గమ్మతిగ జూడవడితిమి ...!!  

Sunday, April 24, 2016

మనది పాఠశాలయు మంచి మమత పెంచు --- తేటగీతి



తేటగీతి ః
ఆట పాటలు సిరిమల్లి తోటలాయె అక్షరాలన్ని విజ్ఞాన లక్షలాయె
సదువులమ్మ ఒడిన లక్ష్య సాధనమ్ము
మనది పాఠశాలయు మంచి మమత పెంచు
... నర్సింహ రెడ్డి తగిరంచ

చిరునగవులొల్కు కుసుమాలు చిగురు తొడుగు
ఎదుగు పైస్థాయి పదవులకేగి మురిసె
సరిగమలొలుకు విరితేనె సంబురాలు
మనది పాఠశాలయు మంచి మమత పెంచు
నర్సింహ రెడ్డి తగిరంచ
తరగతి గదులన్నియు మార్చు తమరి గతిని
ఆభరణములై మెరిసేను చార్టులన్ని
రంగులమయమాయె కళలు రంగరించి
మనది పాఠశాలయు మంచి మమత పెంచు



comments pls

విధిని బొందవెడ్తున్రు

పెద్ద బాపు ! యాడున్నవే?
మను గాడచ్చిండు ...
మంచం కాడికి వోయి
తాతా తాతా అంటుండు
చెంచా తెచ్చి ండు
పాలు తాగిపిస్తడట.....
తువాల తోని
మూతి తుడత్తడట...

తీరొక్క తరాక
తల్చుకుంట తల్చుకుంట
కనుకున్నోల్లు
కావాల్సినోళ్లు
తల్లడిల్లి పోతున్రు ....
ఏండ్ల సంది దూరమైన
రక్త బంధం దగ్గరై
ఎక్కెక్కి ఏడ్వవట్టె !?
అందర్ల మంచి పేరు తెచ్చకుని
అందరికి దూరమై పోతివి...
దేవుని దగ్గరికి పోయినవట
పిల్లలంటున్రు .....
అవును
నువ్ దేవుని ఒడిలో
ప్రశాంతంగా నిద్ర పోతున్నవ్ ..!!
***
***
ఒరేయ్ సాయి....
ఏందిరా గిట్ల చేత్తివి
పద్దేందేండ్ల సంది మా తోనే ఉంటివి
పానమోలే అందరితో కలిసుంటివి
నువ్ దూరమైనవంటే
ఎవలు నమ్ముతలే ???
నమ్మబుద్దైతలేదు ......
మొన్నటికి మొన్న
కొన్ని బోరు పొక్కలు సూత్తివి
కొందరి దూప తీర్తివి ...
కాలేజికి పోయే పోరడు
కానరాని లోకాలకు పోయిండని
కన్న తల్లి దండ్రులు
కుమిలి కుమిలి పోయే..
కనుల పొంట
కుండపోత కురువవట్టె ...
సోపతోళ్లంతా
ఆ దేవున్ని శాపనార్థాలు
పెడుతున్రు ...
మంచి పోరన్ని
మాగ్గాకుండా చేసేనని
విధిని బొందవెడ్తున్రు ....
సాయి ....
యాడున్న
మా మదిల
మెదుల్తనే ఉంటవ్ ...
rest in peace

ఇదేమన్న గాచారమా .....?!

ఇదేమన్న గాచారమా .....?!
లేక పీడ దినమా.. !!!?
అందరూ పిట్టలోలే రాలిపోతున్నరు !
ఇప్పుడే ముత్యమోలే నవ్వుకుంట
ఆటోల పోయినవ్ ...!
అటే పోయినవ్ అంటున్రు
గిసోంటి గడియ
దునియల యినలే...!
ఆటో రవన్న , .....
దుఃఖం ఆగుతలేదు ....
ఎన్నడూ
నీముఖంల చిరునవ్వు
వాడలేదు...
ఆఖరుకు యిప్పుడు కూడా ..!!
కోపమంటే ఏంటో
నీ యింటి కడపకు
కూడా తెల్వది ....!!
ఎవల్ని యెన్నడూ
నొప్పించలేని
మమతలెరిగిన
మంచి మనసున్న
అనురాగమూర్తివి !
దోస్తులల్ల సక్కగ మెదిలినోనివి ..
అందరికి యింటి మవిషి లెక్క ,!!

బడి బాట వట్టిన
బుడ్డ పోరగాండ్ల
భవిష్యత్తేంటో...??
అభం శుభం తెలియని
ఆ యిల్లాలి పరిస్థితి ..????
రవన్నా...
నీ ఆఖరి సూపు కొరకు ...
ఉసికె వోసినా రాలనంత జనం ..
ఊరు ఊరంతా
ఉప్పొంగే కన్నీటి సంద్రమైంది ..
పానమంటే గింత లెక్కలేదు
ప్రేమానుబంధాలెరుగని
గా యములోని కైనా ...! .
రక్త బంధాల విలువ తెలియని
ఏ భగవంతునికైనా ...!!
రవన్నా..... నీ మంచితనం
చెదరని చిరునవ్వు
కోపమెరుగని మనసు
అందరికీ అందించు .....
*** స్వర్గమా నువు ధన్యమైతివి పో... ***
rest in peace

cps antham- maa pantham - kavitha

ఎగిలివారంగనే లేసి
ఎగిర్తపడి తయారై
బడికి తొవ్వ వట్టేటోన్ని.....
ఏమైందో ఇయ్యాళ
ఎర్ర పోరడు
వాకిట్ల చేరి
ఎండపొడ తో
ముగ్గులు వెడ్తుం టే
కండ్లు శెక్కుమనంగ లేశిన ...
మనుసు
మనుసున లేదు ...
కంటి మీద కునుకు పడ్త లేదు....
నౌకరుంది ... నీకేంది బిడ్డ
అంటుంది అమ్మమ్మ .....
ఔ...
నౌకరుంది ....
దానీతోనే cps అనే
రందీ కూడా ఉంది....
ఎటువోయిన
పయిలం అంటుంటే
గండెల్ల కలుక్కుమంటుంది
నౌకరున్న
భవిష్యత్తుకు పయిలం లేక !!
నౌకరుకే నవ్వుల పాలు తెచ్చే
cps ని నామారూపాల్లేకండా చేసి
పాత పెన్షను విదానం తెస్తేనే
పానం కుదుటవడ్తది ....
మన బతుకులకు
మనాది పోయి
పోరగాండ్లకు
తిరమైతది....
సర్కారూ ...
జెర సోంచాయించు..
పానంల
పానం నిలుపు....
పాత పెన్షను విదానము
తో...
-------- నర్సింహ రెడ్డి తగిరంచ

మరోసారి రావా..


నువ్వే నా జవాబు గా ... kavitha


నా ఎద వసంతం kavitha


నేను - కవిత


మంచె - కవిత





Wednesday, April 20, 2016

manasvi.....(MAHA)






సుగుణాల బాల యాడికే----- పాట 2012 లొ




 ప:   సూదంటు రాయి సూపులున్న
       సుగుణాల బాల యాడికే..
       నా మందారమాల యాడికే....
       మనసంత దోచేటి నవ్వులున్న
                   నగుమోముదానా యాడికే..
                    నాఎదలోని దేవి యాడికే....


చ : ఒక్కసారన్న నువ్ చూస్తావని
     ఒక్క తీరుగ నీ యెనకే తిరిగా..
     పక్కకెంచినువ్ పోతావుంటే
      ప్రాణమంత నాదాగమాయే
            ఓ పగడాలపిల్లా యాడికే...
            నా పరువాల కొమ్మ యాడికే... 

చ : నువ్వెల్లెటి తొవ్వల్ల యెన్నేల  వెలుగులు
       నడిచేటి బాటల్ల నాజూకు తీగెలు
       పలికేటి మాటల్ల బంగారు తూటాలు
       గుచ్చి చేసే నా గుండెల్లో గాయాలు....
                    ఓ పున్నమీ యెన్నీల యాడికే..
                    నా యెండి కొండ జెర చూడవే.....

చ   :సిరి సిరి మువ్వల సంగీతమూ నువ్వు
     సెలయేటి గలగలల సాహిత్యము నువ్వు...
     విరిసేటి హరివిల్లు అమ్మువు నువ్వై
      సంధించి  నా గుండె బంధించినావే ...
             ఓ ముత్యాల ధార యాడికే..
            నా మురిపాల కొమ్మ యాడికే....
                            .............. నర్సింహ రెడ్డి తగిరంచ